Take a fresh look at your lifestyle.

AP: రూ.10 వేల కోట్లతో ఫుడ్‌ ప్రాససింగ్‌ నిర్వహణకు సీఎం గ్రీన్ సిగ్నల్   

అమరావతి:: రూ.10 వేల కోట్లు ఖర్చుతో గోడౌన్ల నుంచి ఫుడ్‌ ప్రాససింగ్‌ వరకు అన్ని కార్యకలాపాలు నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫుడ్‌ ప్రాససింగ్‌ క్లస్టర్ల నిర్వహణపై ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు చెందిన అధికారులతో సీఎం ‌సమీక్షించారు.

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రైతులు అధికంగా పండిస్తున్న పంటల వివరాలను సేకరించి, ఆ మేరకు ప్రాససింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు  ప్రణాళికలు  సిద్ధం చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఫుడ్‌ ప్రాససింగ్‌ రంగంలో అనుసరిస్తున్న కొత్త సాంకేతిక విధానాలు, వాటి వల్ల ఉపయోగాలపై సమావేశంలో చర్చించారు.  ప్రాససింగ్‌ చేసిన తర్వాత మార్కెటింగ్‌ కోసం పెద్ద పెద్ద సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొనునన్నట్లు అధికారులు తెలిపారు.  మొక్కజొన్న, చిరుధాన్యాలు (మిల్లెట్స్‌), కందులు, అరటి, టమోటా, మామిడి, చీనీ, ఉల్లి, మిర్చి, పసుపు తదితర పంటల దిగుబడి, అవసరమైన ప్రాససింగ్‌ ప్లాంట్లపై ప్రతిపాదనల అంశాలను సీఎం ముందుంచారు.  ప్రాససింగ్‌ యూనిట్లకు దాదాపు రూ.2900 కోట్లు ఖర్చు అవుతుందని,  ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 ప్రాససింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు  ప్రతిపాదించినట్లు సీఎంకు అధికారులు వివరించారు. .

రైతులకు మంచి ధరలు అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, దీని కోసమే అనేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ఈ ధరలకు పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే మనం రైతులకు చెప్తున్నామని, కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వం పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందన్నారు. అలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ (వాల్యూ ఎడిషన్‌) జోడించడం చాలా ముఖ్యమని అందు కోసం ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు, క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగం, ప్రాససింగ్‌ యూనిట్లకు ముడి పదార్థాలను అందించేలా ఉండాలని, ప్రాసస్‌ చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌లో వివిధ సంస్థలకు అప్పగించాలని తద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం? దానికి సరిపడా ఎక్కడెక్కడ ప్రాససింగ్‌ ప్లాంట్లను పెట్టాలన్న దానిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం.  రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు సరి పడే సామర్థ్యంతో ఈ ప్రాససింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు.  రైతులు సమస్యలు ఎదుర్కొంటున్న అరటి, చీనీ తదితర ఉత్పత్తుల ప్రాససింగ్, వాల్యూ యాడ్‌తో ఉత్పత్తుల తయారీ అంశాలపై దృష్టి పెట్టాలని,  దీనిపై మరింతగా పరిశీలన, అధ్యయనం చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాససింగ్, ప్యాకేజింగ్‌ తదితర అంశాల్లో కొత్త సాంకేతిక విధానాలపై ఒక వింగ్‌ పని చేయాలన్నారు.

ఫుడ్‌ ప్రాససింగ్‌ రంగంలో ఒక మెగా ప్లాంట్‌ అవసరం ఉందన్న అధికారులు, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని  సీఎం ఆదేశించారు.  ఆర్బీకేల పరిధిలో గోడౌన్ల నిర్మాణం, జనతా బజార్లు, ప్రాథమిక ఆహార ఉత్పత్తుల శుద్ధి. అలాగే రెండో దశ ప్రాససింగ్, మొత్తం ఈ కార్యక్రమాల కోసం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం ప్రకటించారు.  ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లపై పెద్ద ఉత్తున డబ్బు వెచ్చిస్తున్నందున యూనిట్లన్నీ కూడా అత్యంత ప్రొఫెషనల్‌ విధానంలో నడవాలని, రైతులకు అండగా నిలవాలని అధికారులను సీఎం కోరారు.  వాటి నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని. ఈ ప్రాససింగ్‌ యూనిట్లు బలోపేతంగా, సమర్థవంతగా నడపడం వల్ల రైతులకు అండగా నిలిచినట్టు అవుతుందని, ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు విశ్వసనీయత గల సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.