హైదరాబాద్-సింగరేణి: ‘పర్యావరణ స్పూర్తి ప్రదాత’ డైరెక్టర్ ఎన్. బలరామ్
Solid tribute to N. Balaram, Director (Finance & P&P) who planted 10,000 seedlings himself
సింగరేణి కాలరీస్ కంపెనీలో స్వయంగా పారపట్టి 10 వేల మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించిన డైరెక్టర్ (ఫైనాన్స్ & పి&పి) ఎన్.బలరామ్ ప్రజలందరికీ ఒక గొప్ప పర్యావరణ స్పూర్తిగా నిలిచారని డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా) ఎస్.చంద్రశేఖర్ పేర్కొన్నారు.
డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరామ్ 10 వేల మొక్కలు నాటే లక్ష్యాన్ని ఇటీవల భూపాలపల్లి ఏరియాలో 665 మొక్కలు నాటి పూర్తిచేసిన సందర్భంగా ఆయనను హైద్రాబాద్ సింగరేణి భవన్లో గురువారం (ఫిబ్రవరి 18వ తేదీ) నాడు అధికారుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇ.డి. (కోల్ మూమెంట్) జె.ఆల్విన్, జి.ఎం. (కో-ఆర్డినేషన్) కె.రవిశంకర్, జి.ఎం. (సి.పి.పి.) నాగభూషన్ రెడ్డి, ఎ.జి.ఎం. (ఫైనాన్స్) రాజేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్ వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా) ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు కేవలం మాట ద్వారా కాకుండా, స్వయంగా పారపట్టుకొని 10 వేల మొక్కలు నాటడం అత్యంత స్పూర్తి దాయకమైన చర్యగా అభివర్ణించారు. అందరూ ఆయన్ను స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. ఒక్కొక్క మొక్క లక్షల రూపాయల విలువైన ఆక్సిజన్ ను ప్రకృతికి ఇస్తుందనీ, ఎన్.బలరామ్ నాటిన 10 వేల మొక్కలు కోట్ల రూపాయల విలువ చేసే ప్రకృతి సంపదను సృష్టిస్తాయని ప్రశంసించారు.
డైరెక్టర్ (ఫైనాన్స్ & పి&పి) ఎన్.బలరామ్ మాట్లాడుతూ తాను చిన్నతనం నుండే ఎంతో ఇష్టంగా మొక్కలు నాటుతుండేవాడిననీ, గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా తాను మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాల్లోనే కాక ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా మొక్కలు నాటానని తెలిపారు. తాను నాటిన 10 వేల మొక్కలు పాదుకోవడం సంతోషకరమనీ, ఈ యజ్ఞాన్ని నిర్వహించడానికి తాను సింగరేణిలో ఉండటమే కారణమనీ, సింగరేణిలో హరితహారం విజయవంతం చేయడానికి ప్రొత్సహిస్తున్న సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ కు, సహ డైరెక్టర్లకు, గ్రీన్ ఛాలెంజ్ నిర్వహకులు సంతోష్ కుమార్ కు తన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్.బలరామ్ వివిధ ఏరియాల్లో 10 వేల మొక్కలు నాటడంపై నిర్మించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి గణాశంకర్ పూజారి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.