Take a fresh look at your lifestyle.

కరోనాపై అప్రమత్తంగా ఉండండి… జాగ్రత్త చర్యలు కొనసాగించండి

  • కరోనా నిర్ధరణ పరీక్షలు పెంచాలి
  • 24న హరిత హారంలో 5 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
  • సమీక్షా సమావేశంలో ఏరియా జీఎంలకు డైరెక్టర్ల ఆదేశం

కరోనా నుంచి రక్షణ కోసం ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయించినప్పటికీ ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వహించకుండా కరోనా జాగ్రత్త చర్యలను యథావిధిగా పాటించాలని సింగరేణి డైరెక్టర్లు శ్రీ ఎస్.చంద్రశేఖర్, శ్రీ ఎన్.బలరామ్, శ్రీ డి.సత్యనారాయణ రావు సూచించారు. ప్రస్తుతం వ్యాధి తీవ్రత ఇంకా ఉందని హెచ్చరించారు. స్వీయ జాగ్రత్తలతోనే కరోనా నుంచి పూర్తి రక్షణ సాధ్యమవుతుందని వివరించారు. సింగరేణిలో కరోనా నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై ఏరియా జనరల్ మేనేజర్లతో బుధవారం (జూలై 21వ తేది) నాడు వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో డైరెక్టర్లు మాట్లాడారు.

కరోనా కేసులను నిర్ధరించడానికి వీలుగా ఉద్యోగుల కుటుంబీకులు, కాంట్రాక్టు ఉద్యో గులకు ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించేలా చూడాలని, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. కంపెనీ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

కంపెనీ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఐదు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటికే కొత్తగూడెంలో నెలకొల్పిన కేంద్రం ద్వారా ప్రాణవాయువును అందిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

కరోనా బారిన పడిన వారు మూడు నెలల తర్వాత కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో దోమల వల్ల డెంగీ తదితర సీజనల్ వ్యాధుల బారిన ఉద్యోగులు పడకుండా చూడాలని, దోమల నిర్మూలనకు కాలనీల్లో చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Midle of the post

ఈ సందర్భంగా డైరెక్టర్లు ఆయా ఏరియాల జనరల్ మేనేజర్లతో కరోనా పరిస్థితులు, ఇంకా తీసుకోవాల్సిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల కుటుంబీకులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇప్పించేలా చూడాలని ఈ సందర్భంగా ఏరియా జీఎంలు కోరగా.. వ్యాక్సిన్ కోసం ఇప్పటికే సీఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని డైరెక్టర్లు వివరించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్సులో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి జీఎం (కో-ఆర్డినేషన్) శ్రీ కె.సూర్యనారాయణ మాట్లాడుతూ… క‌రోనా చికిత్స‌కు సంబంధించిన ఔష‌ధాలు, ఇత‌ర‌త్రా ప‌రిక‌రాలు, ఉద్యోగుల‌కు మాస్కులు, శానిటైజ‌ర్ల అవ‌స‌రం ఉంటే త‌మ‌కు తెలియ‌జేస్తే త‌క్ష‌ణ‌మే స‌మ‌కూర్చుతామ‌ని పేర్కొన్నారు. అలాగే ఆయా ఏరియాల్లో ప్ర‌భుత్వ కేంద్రాల‌లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటున్న నేప‌థ్యంలో సింగ‌రేణికి వ్యాక్సిన్ వచ్చేంత వ‌ర‌కు ఉద్యోగుల కుటుంబీకులు, కాంట్రాక్టు ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న వ్యాక్సిన్ ను తీసుకునేలా ప్రోత్స‌హించాల‌న్నారు. కంపెనీ ఆసుప‌త్రుల‌లో కోవాక్సిన్ తొలి డోసు వేయించుకున్న ఉద్యోగులు రెండో డోసును కూడా స‌కాలంలో తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

24 వ తేదీన 5 లక్షల మొక్కలు నాటాలి : డైరెక్టర్(పర్సనల్, ఫైనాన్స్) శ్రీ ఎన్.బలరామ్

సింగరేణి వ్యాప్తంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ లో డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) శ్రీ ఎన్.బలరామ్ సమీక్షించారు. హరిత హారంలో భాగంగా ఈ నెల 24వ తేదీన పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. అన్ని ఏరియాల్లో కలిపి 5 లక్షల మొక్కలు నాటడం, పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. తాను రామగుండం ఏరియా నుంచి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నట్లు తెలిపారు. వారి వారి ఏరియాల లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

కొత్తగూడెం కార్పోరేట్ ఆఫీస్ నుంచి జీఎం(సేఫ్టీ, సీపీపీ) శ్రీ వెంకటేశ్వరరెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీ మంథా శ్రీనివాస్, ఆయా ఏరియాల జీఎంలు, డీవైసీఎంవో శ్రీ బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు.

చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్

Leave A Reply

Your email address will not be published.