- సింగరేణిలో ఆదివాసుల సంక్షేమానికి ప్రాధాన్యం
- ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో డైరెక్టర్లు శ్రీ ఎస్.చంద్రశేఖర్, శ్రీ ఎన్.బలరామ్
World Tribal Day అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసుల అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్, పా, పి అండ్ పి) శ్రీ ఎన్.బలరామ్ అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అడవుల్లోనే జీవిస్తున్న ఆదివాసుల అభ్యున్నతికి రాజ్యాంగంలో ప్రత్యేక షెడ్యూళ్లను పొందుపరిచారని, వాటి పట్ల ఆదివాసీలకు సమగ్ర అవగాహన కల్పిస్తూ వారి పురోగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సోమవారం (ఆగస్టు 9వ తేదీ) నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సింగరేణి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీ ఎస్.చంద్రశేఖర్, శ్రీ ఎన్.బలరామ్ ప్రసంగించారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కు, చట్టాల పట్ల ప్రతీఒక్కరికీ అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి 1994లో ప్రతీ ఏడాది ఆగస్టు 9వ తేదీ ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా పాటించాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. ఆదివాసీలందరినీ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న ధీమాతో ఈ ఏడాది ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి లో గిరిజనుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని, జీవో నెంబర్ 34 అమలు చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేసిందని వివరించారు.

ఉద్యోగ నియామకాల్లోనూ పారదర్శకత పాటిస్తూ గిరిజన అభ్యర్థులకు సింగరేణిలో మంచి అవకాశాలు దక్కేలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలో అనేక చట్టాల రూపకల్పన చేశారని, వాటిపై గిరిజనులకు సమగ్ర అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను, అస్థిత్వాన్ని గౌరవించి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గిరిజనుల అభివృద్ధి జరిగినప్పుడే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు.
కార్యక్రమంలో జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్, మార్కెటింగ్) శ్రీ కె.సూర్యనారాయణ, జీఎం (సీపీపీ) శ్రీ వెంకటేశ్వరరెడ్డి, జీఎం (ఎన్విరాన్మెంట్) శ్రీ రవిప్రసాద్, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్.వి.రాజశేఖర్‌రావు, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు శ్రీ బోడ భద్రు, గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్, ప్రజా కవి జయరాజ్ పాల్గొని ప్రసంగించారు. వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.