Telangana Forest: “హరితహారం ఒక హరిత విప్లవంగా మారాలంటే” మరికొన్ని మార్పులు తప్పనిసరి: D.Narender GS FRO’s Association
Telangan Ku Harithaharam: “హరితహారం ఒక హరిత విప్లవంగా మారాలంటే”ఈ మార్గంలో అటవీ శాఖలో మార్పునకు నాంది పడితే ఖచ్చితంగా “జంగిల్ బాచావో, జంగిల్ బాడావో” అన్న గౌరవ ముఖ్యమంత్రి ఆశయం నెరవేరుతుందని తెలంగాణ అటవీ క్షేత్రాధికారుల సంఘం అభిప్రాయపడింది. మొక్కలు నాటే కార్యక్రమాల్లో తెలంగాణకు హరితహారం ప్రపంచంలోనే ఒక అతి పెద్ద నిరవధిక హరిత విప్లవం అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంఘం కొన్ని సూచనలు చేసింది. వాటి వివరాలను తెలంగాణ అటవీ క్షేత్రాధికారుల సంఘం జనరల్ సెక్రెటరీ డి. నరేందర్ వివరించారు.
సమైక్య ఆంధ్ర ప్రదేశ్ లో కనీస బడ్జెటకు కూడా నోచుకోని అటవీ శాఖ ముఖ్యంగా అటవీ పునరుద్ధరణకై కంకణం కట్టుకున్న గౌరవ ముఖ్య మంత్రి గారి సారధ్యంలో తెలంగాణకు హరిత హారము అనే భృహత్తర కార్యక్రమం ద్వారా ఏడు విడతల్లో అటు అటవీ ప్రాంతములో, ఇటు అటవీ ప్రాంతానికి బయట సహితం దాదాపు 230 కోట్లకు మించి మొక్కలను నాటి రక్షించడం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర పరిపాలన సౌలభ్యం కొరకు, పరిపాలన పునః వ్యవస్థీకరణలో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగినది. అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగానే అటవీ శాఖను రెవెన్యూ జిల్లాల ఆధారంగా పునః వ్యవస్థీకరించి పూర్వంగా ఉన్న సామాజిక, వన్య ప్రాణి, ప్రాధేశీక (Territorial) విభాగాలను ఏకం చేసి ఒకే విభాగం క్రిందకు మార్చడం జరిగినది.
దీని ద్వారా ఎన్నో సంవత్సరాలుగా డివిజన్, రేంజ్, సెక్షన్, బీట్, అనే అటవీ యూనిట్ల పరిధిలను తగ్గించాలన్న డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చి క్రొత్తగా డివిజన్లను, రేంజిలను, సెక్షన్లను, బీటలను ఏర్పాటు చేయడం జరిగినది.
ఒక వైపు పరిధిని తగ్గించి మరొకవైపు 1857 బీటు అధికారులను, 90 సెక్షన్ అధికారులను 67 రేంజి అధికారులను నియమించి అటవీ శాఖను పరిపుష్టం చేసింది . దీని తో పాటు వివిధ హోదాల్లో ఉన్న క్షేత్ర స్థాయి అధికారులకు క్రొత్త వాహనాలను సమకూర్చింది.
కానీ ఇదే సమయంలో జిల్లా స్థాయిలో అటవీ రక్షణ కమిటీలను, తెలంగాణ హరిత హారంలో జిల్ల కమిటీలను ఏర్పాటు చేసింది. అటవీ శాఖలోని అటవీ మండలాధికారులను, జిల్లా అటవీ అధికారులను ఈ కమిటీ పరిధి క్రిందకు తీసుకువొచ్చింది. దీని ఫలితంగా అటవీ ఉన్నతాధికారులు అనునిత్యం మీటింగులకు, సమీక్షలకు ఎక్కువగా హాజరు కావలిసిన పరిస్థితి ఏర్పడింది.
ఫలితంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అటవీ ఉన్నతాధికారులు (Divisional/District) ఆఫీసు పనులకే పరిమితమౌతున్నారు. ఒకప్పుడు అటవీ డివిజనల్ అధికారులు (అఖిల భారత సర్వీసు అధికారులు సహితం) వారంలో నాలుగు నుండి ఐదు రోజులు అటవీ బీటు మ్యాప్‌ల ఆధారంగా క్షేత్ర స్థాయిలో అటవీ పర్యవేక్షణ చేసే వారు.
కానీ అప్పుడు తక్కువ సంఖ్యలో క్రింది స్థాయి ఉద్యోగస్తులు ఉండడం, వారి పరిధి ఎక్కువగా ఉండటం వలన అటవీ భూదురాక్రమణలను, అక్రమ కలప రవాణాను, అక్రమ వన్య ప్రాణుల వేటను కొంత వరకు అడ్డుకట్ట వేయ గలిగారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు.
క్రింది స్థాయిలో పూర్తి సంఖ్యలో అధికారగణం అంటే క్షేత్ర స్థాయి సిబ్బంది ఉన్నా, వారికి వాహనాలు సమకూర్చినా, దానికి తగిన సాంకేతికత ఉన్నా, ఉన్నత స్థాయి అధికారుల క్షేత్ర స్థాయి పర్యవేక్షణ తగ్గిన కారణంగా కింది స్థాయి సిబ్బంది కూడా అటవీ రక్షణలో తగిన పర్యవేక్షణ చేయడంలేదు. కావున అటవీ ఉన్నతాధికారులను ఆటవీయేతర కార్యక్రమాలనుండి విముక్తులను చేసి మీటింగులు, సమీక్షలకు హాజరు కావలసిన భాద్యతలను తగ్గించే ప్రయత్నం జరిగితే ఉన్నత స్థాయి అటవీ అధికారులు పూర్తిగా అటవీ పర్యవేక్షణకై పూర్తి సమయం కేటాయించుటకు ఆస్కారం ఉంటుంది.
“జంగిల్ బచావో, జంగిల్ బడావో” అన్న గౌరవ ముఖ్య మంత్రి గారిచ్చిన నినాదం అమలు కావాలన్న, ఇక పై అటవీ భూమి ఇంచు కూడా ఆక్రమణకు గురి కావొద్దన్న గౌరవ ముఖ్య మంత్రి గారి సంకల్పం నెరవేరాలన్నా, ఎన్ని కోట్ల మొక్కలు నాటినా అవి సహజ సిద్దంగా పెరిగిన అడవికి సరితూగలేవన్న ముఖ్యమంత్రి గారి స్పూర్తి ఆచరణ రూపం దాల్చాలన్న అటవీ ఉన్నతాధికారులను అటవీయేతర కార్యక్రమాల నుండి విముక్తులను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దీని కొరకై ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మొక్కలు నాటే ప్రయత్నంగా చెప్పబడుతున్న తెలంగాణకు హరిత హారం కార్యక్రమం అమలుకు ప్రతి జిల్లాకు ఒక ప్రేత్యేక ఆఫీసును ఏర్పాటు చేయడం ఆవశ్యకం. అది ఈ క్రింది విదంగా ఉపయోగ పడుతుంది.
ప్రతి జిల్లా స్థాయిలో కలెక్టరు గారి పర్యవేక్షణలో తెలంగాణకు హరితహారం ప్రత్యేక అధికారి ఆఫీసు ను నెలకొలపాలి. దీని కొరకై 33 జిల్లాలో అటవీ మండలాధికారికి సమానమైన అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫోరెస్ట్స్ స్థాయి పోస్టులను (33) నియమించాలి. వారి క్రింద పని చేయుటకు ముఖ్యంగా అన్ని శాఖల హరితహారం పని తీరును పర్యవేక్షించుటకు ప్రతి జిల్లాకు ఇద్దరు రేంజ్ అధికారులను (66) నియమించాలి.
ఈ తెలంగాణకు హరితహారం ప్రత్యేక అధికారి మరియు వారి కార్యాలయం అన్నీ శాఖలకు హరితహారానికి సంబందించి సాంకేతిక పరమైన సలహాలను, సూచనలను నర్సరీలను పెంచటంలో, అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్లను అభివృద్ది చేయటంలో సహాయ పడుతుంది. అటవీ అధికారులకు ఉన్న సాంకేతిక తర్ఫీదు మరియు అనుభవం అన్నీ శాఖల్లో హరితహారం విజయవంతవడంలో తోడ్పడుతుంది.
ఒకవైపు కలెక్టర్లకు హరితహారం కార్యక్రమంలో తెలంగాణకు హరితహారం ప్రత్యేక అధికారి ఆఫీసు పూర్తి సహకారం అందిస్తుంది మరియు అటవీ ఉన్నతాధికారులు అటవీ రక్షణకై పూర్తి స్థాయిలో సమయం కేటాయించేలా తోడ్పడుతుంది. ఫలితంగా అటవీ క్షేత్ర స్థాయి పర్యవేక్షణ కట్టుదిట్టమవుతుంది.
గౌరవ ముఖ్యమంత్రి ఏర్పాటు చేయదలిచిన “తెలంగాణ హరిత నిధి” ని తెలంగాణ కు హరితహరం కార్యక్రమాలకు అన్నీ శాఖలకు కలెక్టర్ల ద్వారా నిధులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ ఖర్చును పర్యవేక్షించి దానికి సంబందించి తెలంగాణకు హరితహారం ప్రత్యేక అధికారి కార్యాలయం ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారిగా వ్యవహిరిస్తుంది.
అటవీ దురాక్రమణలో, అక్రమ కలప రవాణాలో, అక్రమ వన్య ప్రాణుల వేటలో క్షేత్ర స్థాయి సిబ్బంది పై జరుగుతున్న దాడులను నియంత్రించుటకు కేరళ రాష్ట్ర తరహాలో “అటవీ స్టేషన్ల” మాదిరిగా తెలంగాణ లో ప్రతి అటవీ డివిజన్ కు ఒక అటవీ రక్షణ సాయుధ దళాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అటవీ శాఖను సర్వసన్నద్ధం చేయవొచ్చు. అటవీ స్టేషన్ల మోడల్ కేరళలో సత్ఫలితాలను ఇచ్చింది.
అటవీ శాఖలో పని చేయుచున్న FBO, FSO, Dy.RO, FRO స్థాయిలో ఉన్న uniform అధికారులకు పోలీసులతో సమానంగా అన్నీ సౌకర్యాలు కల్పించి అటవీ క్షేత్రాధికారుల కార్యాలయాలను SHO కార్యాలయాల మాదిరిగా మరింత సౌకర్యవంతంగా, సాంకేతికంగా, వ్యవస్థాపరంగా, మౌళిక వసతుల కల్పనలో ఆధునీకరించాలి.
ఈ మార్గంలో అటవీ శాఖలో మార్పునకు నాంది పడితే ఖచ్చితంగా “జంగిల్ బాచావో, జంగిల్ బాడావో” అన్న గౌరవ ముఖ్యమంత్రి ఆశయం నెరవేరుతుంది. మొక్కలు నాటే కార్యక్రమాల్లో తెలంగాణకు హరితహారం ప్రపంచంలోనే ఒక అతి పెద్ద నిరవధిక హరిత విప్లవం అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.
డి. నరేందర్, జనరల్ సెక్రెటరీ, తెలంగాణ అటవీ క్షేత్రాధికారుల సంఘం