Singareni: We extend our condolences to the families of the victims of the Adriala mine accident
GM (Coordination) Shri K. Suryanarayana at the mourning function at Singareni Bhavan today.
అడ్రియాల లాంగ్ వాల్ గనిలో సంభవించిన ప్రమాదంలో ఇద్దరు అధికారులు సహా ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి చెందడం అత్యంత బాధకరమని జీఎం(కో ఆర్డినేషన్) శ్రీ కె.సూర్యనారాయణ అన్నారు. బాధిత కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. దుర్ఘటనలో మృతిచెందిన ఏరియా సేఫ్టీ అధికారి శ్రీ జయరాజు, డిప్యూటీ మేనేజర్ శ్రీ తేజావత్ చైతన్య తేజ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీ టి.శ్రీకాంత్ లకు శనివారం సింగరేణి భవన్ లో ఉద్యోగుల సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా జీఎం (కో ఆర్డినేషన్) శ్రీ కె.సూర్యనారాయణ మాట్లాడుతూ.. దేశానికి వెలుగులు నింపేందుకు సింగరేణి ఉద్యోగులు, అధికారులు అత్యంత విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను ఫణంగా పెడుతూ బొగ్గు వెలికితీస్తున్నారని పేర్కొన్నారు. అడ్రియాల లాంగ్ వాల్ గని దుర్ఘటనలో అనుభవజ్ఞుడైన అధికారిని, ఉజ్వల భవిష్యత్ ఉన్న మైనింగ్ ఇంజినీర్ ని, ఉపాధి కోసం పనిలో చేరిన యువకుడిని కోల్పోవడం అందరినీ కలచివేసిందన్నారు. గనిలో రక్షణ చర్యల కోసం ముందుజాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుందని వివరించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియాను అందజేయడం జరిగిందన్నారు.

ఈ ప్రమాద సమయంలో సింగరేణి రెస్య్కూ సిబ్బంది సాహసాన్ని జీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. దాదాపు 40 గంటల పాటు సుదీర్ఘంగా రెస్క్యూ ఆపరేషన్ చేసి గనిలో చిక్కుకుపోయిన ఆరుగురిలో ముగ్గురిని తమ ప్రాణాలకు తెగించి కాపాడరని, మిగిలిన వారిని రక్షించేందుకు చివర వరకూ ప్రయత్నించారన్నారు.
బొగ్గు గని అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ ఎన్.వి.రాజశేఖరరావు మాట్లాడుతూ.. ఏరియా రక్షణ అధికారి శ్రీ జయరాజు విపత్తును ఊహించి అక్కడ ఉన్న కార్మికులను అప్రమత్తం చేసి పంపించడం జరిగిందని, ఈ క్రమంలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి దాదాపు ఆరుగురు కార్మికులను కాపాడార న్నారు.
సమావేశంలో జీఎం (మార్కెటింగ్) శ్రీ కె.రవిశంకర్, జీఎం(స్ట్రాటెజిక్ ప్లానింగ్) శ్రీ జి.సురేందర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ ఎన్.భాస్కర్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.