అవెన్యూ ప్లాంటేషన్ కు అధిక ప్రాధాన్యత : రహదారుల శాఖలతో సమన్వయం

రాష్ట్రంలో అన్ని జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లు పచ్చదనంతో నిండాలని, అవసరం మేరకు రోడ్ల వెంటనే నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో ఇవాళ అటవీశాఖ, నేషనల్ హైవేస్, ఆర్ అండ్ బీ అధికారులు అరణ్య భవన్ లో సమావేశమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ కరీంనగర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలను వెంటనే అమలు చేయాలని, నర్సరీల సంఖ్య, నెలకొల్పే ప్రదేశాలను వెంటనే ఖరారు చేయాలని నిర్ణయించారు. డీఎఫ్ఓ, హైవేస్ అథారిటీ, ఆర్ అండ్ బీ అధికారులు ఉమ్మడిగా ఆయా జిల్లాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని తెలిపారు.  జాతీయ రహదారుల వెంట 40 నర్సరీలు, రాష్ట్ర హైవేస్ లో 69, రోడ్లు భవనాల పరిధిలోకి వచ్చే రహదారుల వెంట 141  మొత్తం 250 నర్సరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  కరెంట్, నీటి సౌకర్యం, రక్షణ ఉన్న ప్రదేశాలను మాత్రమే నర్సరీలు నెలకొల్పేందుకు తీసుకోవాలని సూచించారు.

ఒక్కో నర్సరీలో 40 వేల చొప్పున మొత్తంగా ఒక కోటి పెద్ద మొక్కలు పెంచేలా, వాటిని అన్ని రోడ్లకు రహదారి వనాలు (ఎవెన్యూ ప్లాంటేషన్ ) కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నర్సరీల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం నుంచే నిధులను వాడుకునేలా ప్రణాళికలు సిద్దం చేయనున్నారు. వెంటనే నర్సరీలను ప్రారంభించి, వచ్చే సీజన్ కల్లా మొక్కలు నాటేలా ప్లాన్ చేయాలని అధికారుల బృందం నిర్ణయించింది.

సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్. శోభతో పాటు, రోడ్లు భవనాల శాఖ ఈ.ఎన్.సీ గణపతి రెడ్డి, నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, అన్ని జిల్లాలకు చెందిన అటవీ, ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు. ఆయా సర్కిల్స్ అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్లతో పాటు అదనపు పీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సీసీఎఫ్ లు చంద్రశేఖర రెడ్డి, సునీతా భగవత్ లు కూడా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *